శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (10:54 IST)

వైద్యుడుగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తమిళనాడు వైద్య మంత్రి

తమిళనాడు వైద్య శాఖా మంత్రిగా డాక్టర్ సి.విజయభాస్కర్ ఉన్నారు. ఈయన నిజజీవితంలో ఓ వైద్యుడు. పైగా, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సభ్యుడుకూడా. దీంతో ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు కరోనా వ్యాక్సిన్ వేయించుకన్నారు. స్థానిక శ్రీ రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ టీకా వేయించుకున్నారు. భార‌త్ బ‌యోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన క‌రోనా టీకా కొవాగ్జిన్‌ను ఆయన వేయించుకున్నారు. 
 
ఇటీవ‌ల తొలి ద‌శ వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన కేంద్ర ప్ర‌భుత్వం మొద‌టి ద‌శ‌లో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు వేయిస్తోన్న విష‌యం తెలిసిందే. తాను కూడా వైద్యుడే కావ‌డంతో విజ‌య‌భాస్క‌ర్ వ్యాక్సిన్ వేయించుకుని ప్ర‌జ‌లు, ఆరోగ్య సిబ్బందిని ప్రోత్స‌హించారు.
 
అంత‌కుముందు విజ‌య‌భాస్క‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యంపై ట్వీట్ చేశారు. 'ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు నేను కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. ఓ వైద్యుడిగా, ఐఎంఏ స‌భ్యుడిగా నేను ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల్లో క‌రోనా వ్యాక్సిన్‌పై న‌మ్మ‌కాన్ని నింప‌డానికే ఈ ప‌ని చేస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకుని క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని అంద‌రినీ కోరుతున్నాను' అని ఆయ‌న చెప్పారు.
 
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి కోవిడ్ వారియర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయితే, తమిళనాడులోని వైద్య సిబ్బంది ఈ టీకాను వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సగం మంది కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోలేదు. దీంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగి వైద్య సిబ్బందిని ప్రోత్సహించేలా వ్యాక్సిన్ వేయించుకున్నారు.