శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (20:01 IST)

స్మార్ట్ కత్తి.. ఆ సమయంలో భద్రకాళిలా మారి చీల్చి చెండాడవచ్చు..

smart knife
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో మహిళలపై లైంగికదాడులను నియంత్రించడానికి ఎన్ని చట్టాలను తీసుకొస్తున్నా.. అవి వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి. చట్టాలలోని లోపాల కారణంగా కామాంధులు.. ఏం చేసినా చెల్లుతుందిలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నాటి నిర్భయ నుంచి నేటి హత్రాస్ వరకూ జరుగుతుందిదే. 
 
అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మహిళల రక్షణ వారి చేతుల్లోనే ఉంది. లైంగిక వేధింపులు, నేరాలు పెరిగిన దృష్ట్యా... ఆత్మరక్షణ చేసుకోవాల్సిందేనని మహిళా సంఘాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఇద్దరు బాలికలు స్మార్ట్ కత్తిని కనుగొన్నారు. ఆకతాయిలెవరైనా మహిళలను బలత్కరించే సమయంలో ఈ కత్తుల ద్వారా అపర భద్రకాళిలా వారిని చీల్చి చెండాడొచ్చు. ఇంకా ఇందులో ఉండే సిమ్ వల్ల వారి కుటుంబ సభ్యులు, పోలీసులకు మెసేజ్ కూడా వెళ్తుంది.
 
వివరాల్లోకెళ్తే... వారణాసిలోని అశోక ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌లో ఇంటర్ చదువుతున్న షాలిని, దీక్షలు ఈ స్మార్ట్ కత్తిని తయారుచేశారు. 70 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్ కత్తిని ఆభరణంగా గానీ, లేదా బ్యాగులో గానీ పెట్టుకోవచ్చు. ఉక్కుతో తయారుచేసిన ఈ కత్తి.. ఒక ఆభరణం మాదిరిగా ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే కత్తి కనిపిస్తుంది. అందులోనే ఒక సిమ్ స్లాట్‌ను కూడా అమర్చారు. 
 
దాన్లో సిమ్‌ను అమర్చారు. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ ఆయుధంతో అక్కడికక్కడ వారిని రక్షించుకోవచ్చు. అంతేగాక దానికి ఉండే చిన్న బటన్‌ను నొక్కడం ద్వారా.. ముందుగా ఆ సిమ్‌లో సేవ్ చేసుకున్న కుటుంబ సభ్యులకు గానీ, స్థానిక పోలీసులకు గానీ బాధితురాలు ఎక్కడున్నదనే విషయం తెలిసిపోతుంది. వారు వచ్చేసరికి కత్తిని ఆయుధంగా కూడా వాడుకోవచ్చు.