1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 మే 2016 (15:39 IST)

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమాండోలు ఎంపిక

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమాండోలను పంపించనుంది. యాంటి నక్సల్‌ ఆపరేషన్స్‌లో పాల్గొనేందుకు తొలివిడతగా 560 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేశారు. వీరందరూ నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. 
 
రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌లో కఠోర శిక్షణ తీసుకున్న మహిళా సిబ్బంది మొదటిసారిగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌కు ఎంపికయ్యారని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.దుర్గాప్రసాద్‌ వెల్లడించారు. మహిళా సిబ్బంది ఈ నెల 6వ తేదీ వరకు శిక్షణ తీసుకున్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు శిక్షణలోనే వారిని సంసిద్ధం చేశామన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మహిళా సిబ్బంది నివసించేందుకు వీలుగా శిబిరాలను, బ్యారక్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
 
మహిళా సిబ్బందిని సరిహద్దులో భద్రతకు నియమించనున్నట్లు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. సెంట్రల్‌ రిజర్వ్‌ మహిళా పోలీసుల తాజా బ్యాచ్‌ సభ్యులకు 44 వారాల పాటు కఠినతరమైన శిక్షణ ఇచ్చారు. నిరాయుధంగా పోరాటం చేయడం, అటవీ వాతావరణంలో దాడులు చేయడం, స్మార్ట్‌ ఆయుధాలను ఉపయోగించడంతో పాటు ఇతర కసరత్తుల్లో నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇచ్చారు.