1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:50 IST)

రైఫిల్‌ షూటింగ్‌ రేంజి గ్రౌండ్‌లో ఓ జింక మృతి ఎలా?

గురువారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన రైఫిల్‌ షూటింగ్‌ రేంజి గ్రౌండ్‌లో ఓ జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శరీరానికి రద్రం ఉండటంతో బుల్లెట్ గాయమై మరణించి ఉంటుందని వర్సిటీ విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ రేంజి కంచె సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రాణి షూటింగ్‌ రేంజ్‌ మైదానంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. 
 
ఈ షూటింగ్‌ రేంజి మైదానంలో ప్రతి రోజూ క్రీడాకారులకు, ఆసక్తి ఉన్నవారికి రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ ఇస్తుంటారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక జింక రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని సెక్యూరిటీ గమనించాడు. వెంటనే యూనివర్సిటీ సెక్యూరిటీ విభాగానికి సమాచారం అందించాడు. దానిని బయటకు తరలించేందుకు సెక్యూరిటీ వాహనం సిద్ధమైంది. 
 
కానీ షూటింగ్‌ రేంజి సిబ్బంది వెళ్లనివ్వకుండా అడ్డుకుని గేట్లకు తాళం వేసారు. రేంజి పరిపాలనాధికారి అలెగ్జాండర్‌ వచ్చే వరకూ కదిలించడానికి లేదని పట్టుబట్టారు. వారి మధ్య వాగ్వివాదం జరిగింది. విద్యార్థులు చెప్పినా వినలేదు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఇన్స్‌పెక్టర్ అలెగ్జాండర్‌తో ఫోన్‌లో మాట్లాడే వరకూ పంపలేదు. 
 
పోలీసులు మాత్రం ఇది అటవీశాఖ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. మరోపక్క అటవీశాఖ రేంజి అధికారి చిరంజీవిరావు కుక్కలు దాడిచేసి చంపి ఉండొచ్చని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.