ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్న విషయం తెల్సిందే. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది. 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13,766 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.