తమిళనాడులో మరో రాజకీయ పార్టీ... దినకరన్ సారథ్యంలో
లోక్‌సభ ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇందులోభాగంగా, తమిళనాడులో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది.
లోక్‌సభ ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇందులోభాగంగా, తమిళనాడులో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది.
ఇప్పటికే విశ్వనటుడు కమల్ హాసన్ 'మక్కళ్ నీది మయ్యమ్' పార్టీని స్థాపించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ మరికొన్ని రోజుల్లో తన పార్టీ గురించి ఓ ప్రకటన చేయనున్నారు. ఇదిలావుంటే, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ఓ కొత్త పార్టీతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త పార్టీ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైపోయింది. ఈ నెల 15నే దినకరన్ తన పార్టీ పేరుతో పాటు గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మదురైలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను వెల్లడిస్తానన్నారు. ప్రజాదరణ ఉన్న అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడం, పార్టీ రెండాకుల గుర్తును కూడా న్యాయపోరాటంలో కోల్పోవడంతో దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ఇప్పటికే ప్రజల ఆదరణ మెండుగా ఉన్న డీఎంకే, అన్నాడిఎంకేలతో పాటుగా కమల్, రజనీ పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుండటంతో అక్కడి రాజకీయాలు నిస్సందేహంగా రసవత్తరంగా మారనున్నాయి.