ప్రెండ్ కుమార్తె కదా అని ఇంట్లోకి రానిస్తే....
తన స్నేహితురాలి కుమార్తె కదా అని ఆ యువతిని ఇంట్లోకి రానిచ్చింది. ఇదే అదునుగా భావించిన ఆ యువతి ఏకంగా 57 లక్షల రూపాయలను కాజేసింది. ఆలస్యంగా తెలుసుకున్న ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ ఢిల్లీకి చెందిన పుష్ప అనే మహిళ... తన ఇంట్లో దొంగతనం జరిగిందని, ఓ ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకుంటే పోయిందని, తన కుమార్తె స్నేహితురాలైన పూజ అనే యువతిపైనే అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు.
ఈ విచారణలో భాగంగా, పూజ అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం చెప్పుకొచ్చింది. పుష్ప ఇంట్లో పెద్దమొత్తంలో డబ్బుందని తెలుసుకున్న ఆమె, ఓ దఫా రూ.27 లక్షలు కాజేసి తన తమ్ముళ్లు వరుణ్, అమిత్‌లకు ఇచ్చి, వారితో ఫ్లాట్ కొనిపించింది.
మరోసారి ఆమె ఇంటికి వెళ్లి, ఇంకో రూ.30 లక్షలు కాజేసింది. పుష్ప ఫిర్యాదుతో విచారించిన పోలీసులు, పూజ నుంచి రూ.29.43 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమె కొనుగోలు చేయించిన ఫ్లాట్‌ను, దొంగిలించిన డబ్బుతో కొన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె సోదరులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు.