సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (15:31 IST)

లగ్జరీ ఫ్లైట్‌లో ఢిల్లీకి వైకాపా ఎంపీలు - పార్టీ పంచాయతీ కోసం ప్రజాధనం వృథా?

అధికార వైకాపాకు చెందిన ఎంపీలు శుక్రవారం ప్రత్యేక లగ్జరీ ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. వారంతూ రాష్ట్రానికి మేలు చేయాలనో లేదా నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రులను కలిసేందుకో వెళ్లారని మాత్రం పొరబడొద్దు. తమ సొంత పంచాయతీ సమస్యను ఢిల్లీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు వారు ఢిల్లీకి వెళ్లారు. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 
 
'కేంద్రానికి మొదటి లేఖగా సెర్బియా పోలీసుల చేతిలో చిక్కుకున్న సహ నిందితుడిని విడిపించమని ఉత్తరం రాశారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు' అని విమర్శించారు.
 
'ఏ రోజు అయినా, కేంద్రం నుంచి రాబట్టే నిధుల కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లారా? మీ పంచాయితీల కోసం ప్రజాధనం వృథా చెయ్యడం ఏంటీ జగన్ గారు?' అని ప్రశ్నించారు. వారు విమానంలో ఢిల్లీకి వెళ్తోన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు కొందరు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంది.