శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (18:19 IST)

వైకాపాపై రాజుగారి 'దండయాత్ర' ప్రారంభం?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దండయాత్ర ప్రారంభమైంది. ఆయన ఢిల్లీ వేదికగా తన పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, వైకాపా తనకు పంపిని షోకాజ్ నోటీసులపై తనకున్న అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉంచారు. పైగా, తాను గెలిచింది ఓ పార్టీ అయితే.. తనకు పంపిన షోకాజ్ నోటీసు మరో లెటర్ హెడ్‌పై ఉందని గుర్తుచేశారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యేడాది పాలనపై విజయకృష్ణంరాజు ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవి తారా స్థాయికి చేరాయి. వీటికి రాజు గట్టిగానే కౌంటరిచ్చారు. పైకా, తనకు కేంద్ర బలగాలతో ప్రాణరక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ కూడా రాశారు. దీంతో రఘురామకృష్ణంరాజు పార్టీ క్రమశిక్షణా చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు వైకాపా షోకాజ్ నోటీసును పంపించింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ నోటీసుకు ఎలాంటి చట్టబద్ధత లేదని స్పష్టంచేశారు. అదేసమయంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ తనకు పంపిన షోకాజ్ నోటీసుల చెల్లుబాటు అంశంపై ఆయన ఎన్నికల సంఘం అధికారులతో చర్చించారు.
 
పార్టీ లెటర్ హెడ్‌పై కాకుండా మరో పేరుతో వున్న లెటర్ హెడ్‌పై నోటీసులు వచ్చాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల లెటర్ హెడ్‌పై వైసీపీ అని ఉందని, పార్టీ అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినందున తాను ఆ నోటీసులను ఏ విధంగా చూడాలి? అనే విషయంలో రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరుతున్నారు.
 
పైగా, ఆ నోటీసులు తనకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరిట వచ్చాయని, ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటాడన్న సందేహాన్ని కూడా ఆయన అధికారుల ముందు వెలిబుచ్చినట్టు సమాచారం. పైగా, ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుందని, కానీ వైసీపీలో అలాంటి కమిటీ లేదని ఆయన అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే, స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి తన భద్రతపై చర్చించనున్నారు. మొత్తంమీద ఢిల్లీకి చేరుకున్న రఘురామకృష్ణంరాజు ఏపీ సర్కారుపై దండయాత్ర మొదలుపెట్టారని చెప్పొచ్చు.