శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (22:08 IST)

మా ఎంపీ కాస్త తేడా : వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సొంత పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. మా ఎంపీ కాస్త తేడా అంటూ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. 
 
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ యేడాది పాలనపై రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఇవి తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆయనకు షోకాజ్ నోటీసు పంపాలని వైకాపా పెద్దలు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ, ఆయన ఒక తేడా మనిషని చెప్పారు. ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారని... ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
 
ఇకపోతే, జగన్మోహన్ రెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు కూడా అంబటి రాంబాబు ఘాటుగా కౌంటరిచ్చారు. జగన్‌ను విమర్శించే అర్హత లోకేశ్‌కు లేదని అన్నారు. 
 
చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడిగా తప్ప లోకేశ్‌కు ఇతర అర్హత ఏముందని ప్రశ్నించారు. డైలాగులు మాట్లాడటం కాదని, దమ్ముండాలని అన్నారు. రాజారెడ్డి మీసంలోని వెంట్రుకకు కూడా లోకేశ్ సరిపోడని చెప్పారు. వడ్డీతో సహా లోకేశ్ ఏం చెల్లిస్తాడని ప్రశ్నించిన అంబటి... హెరిటేజ్ కంపెనీలో అప్పు చెల్లిస్తాడా? అని ఎద్దేవా చేశారు.