శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (15:44 IST)

జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచామని చెప్పుకోవచ్చు.. కానీ, : వైకాపా ఎంపీ

వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత పార్టీలపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ పార్టీలోని అనేక మంది ప్రజా ప్రతినిధులు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచివుండొచ్చు. కానీ, తాను మాత్రం అలా కాదనీ స్పష్టం చేశారు. పైగా, నరసాపురం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయానికి తాను కూడా దోహదపడ్డానని గుర్తుచేశారు.
 
ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లాలోని వైకాపా నేతల మధ్య సయోధ్య చెడింది. వీటిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తన వ్యాఖ్యలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. తనపై విమర్శలు చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. 
 
తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా అక్రమాలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అక్రమ వసూళ్లు, భూముల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని కొంతకాలంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతుంటే వైసీపీ వాళ్లే నొచ్చుకున్నారని తెలిపారు. దాంతో సొంత పార్టీ నుంచే తనపై విమర్శలు వస్తున్నాయని అన్నారు.
 
'మా పార్టీలో ఓ విచిత్రమైన సిద్ధాంతం ఉంది. ఇతర పార్టీల్లోని ఎవరినైనా తిట్టాలంటే వైసీపీలో ఉన్న వారి సామాజిక వర్గం నేతలతోనే తిట్టిస్తారు. ఉదాహరణకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అనాలంటే మా పార్టీలో ఉన్న వారి సామాజిక వర్గ ఎమ్మెల్యేలతోనో, మరొకరితోనే మాట్లాడిస్తారు. 
 
ఇప్పుడు నాపైనా అదే తీరులో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో మాట్లాడిస్తున్నారు. జగన్ దయతో 20 రోజుల్లో ఎంపీనయ్యానని, జగన్ వల్లే పార్లమెంటు కమిటీ ఛైర్మన్ అయ్యానని ప్రసాదరాజు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నా అంతట నేను ఎప్పుడూ వైసీపీలోకి రావాలని అనుకోలేదు. ఎంతో బతిమాలితేనే వచ్చాను.
 
పైగా, నాకు సీటు ఇవ్వమని ఎవర్నీ ప్రాధేయపడలేదు. మీరు రావాలి, మీరు వస్తేనే మాకు సీట్లు పెరుగుతాయి అని బతిమాలారు. నరసాపురం టీడీపీ కంచుకోట అని, మీరే ఇక్కడ్నించి పోటీ చేయాలి అని అడిగితేనే వైసీపీలోకి వెళ్లాను. నేను కాబట్టే ఇక్కడ్నించి నెగ్గాను. జగన్ బొమ్మ పెట్టుకుని నెగ్గామని ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు గాక, కానీ నా ప్రభావం వల్ల కూడా నరసాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలకు ఓట్లు పడ్డాయన్నది నిజం. గతంలో అనేక పర్యాయాలు వైసీపీ వాళ్లు రమ్మన్నా ఛీ కొట్టాను' అని గుర్తుచేశారు.