మొండిచేయి... ఇంత మోసం చేస్తారా... బీజేపీపై విజయసాయిరెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరోమారు మొండిచేయి చూపింది. శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ వైకు కన్నెత్తి చూడలేదు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దాన్ని భర్తీ చేసేందుకు ఏమాత్రం సాహసం చేయలేదు. దీంతో ఏపీ నేతలంతా పెదవి విరుస్తున్నారు.
దీనిపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామని అయితే బడ్జెట్‌లో హోదా ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్లో కొన్ని నెగెటివ్ కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయన్న ఆయన డిపాజిటర్ల బీమా కవర్ రూ.5 లక్షలకు పెంచడం అభినందనీయమన్నారు.
అలాగే రైతుల ఆదాయం 2022కి రెండింతలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఇక ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్‌కు జిఎస్టీ 18 శాతం ఎక్కువని అన్న ఆయన రైల్వే ప్రాజెక్టులు కొత్తగా ఏపీకి ఇచ్చినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.
కానీ, వైకాపాకు చెందిన మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం బడ్జెట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బడ్జెట్ బాగుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టి చూపడం అభినందనీయమన్నారు. కానీ, ఏపీకి రావాల్సిన నిధులపై ఆయన స్పందిస్తూ, కేంద్రంతో కలిసి నడుస్తూ వాటిని సాధించుకుంటామని తెలిపారు.