బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (08:58 IST)

ఒకే దేశం - ఒకే నంబరు : ఫిర్యాదుల స్వీకరణ కోసం 'డయల్ 112'

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ వ్యాప్తంగా ఒకే తరహా సర్వీసులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇప్పటికే 'ఒకే దేశం ఒకే పన్ను' చట్టాన్ని అమలు చేస్తున్నారు. అలాగే, 'ఒకే దేశం ఒకే రేషన్' అనే విధానికి శ్రీకారం చుట్టారు. ఇపుడు ఫిర్యాదుల కోసం ఒకే దేశం ఒకే నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా డయల్ 112 అనే నంబరును అమలు చేయనున్నారు. ఇది వచ్చే అక్టోబరు నుంచి అమల్లోకిరానుంది. 
 
ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో ‘డయల్ 112’ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ నంబరుపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ ఈ ఏడాది మొదట్లోనే కేంద్రం నుంచి ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 
 
మరో రెండు నెలల తర్వాత డయల్ 112 అందుబాటులోకి వస్తుంది. అయితే అప్పటివరకు డయల్ 100 కూడా పనిచేస్తుంది. దానికి వచ్చే ఫోన్ కాల్స్ 112కు అనుసంధానమవుతాయి. డయల్ 112పై సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ విషయంలో ఇప్పటికే ముందున్నాయి.
 
ప్రస్తుతం దేశంలో వివిధ అత్యవసర సేవలకు వివిధ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. పోలీసు సేవలకు 100, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక సేవలకు 101 నంబర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, అమెరికా, యూరప్ దేశాలలో అన్ని సేవలకు ఒకే నంబరును వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఒకే నంబరును తీసుకురావాలని నిర్ణయించింది.
 
కొత్త నంబరులో విపత్తు నివారణ, గృహ హింస, వేధింపులకు సంబంధించిన సేవలను కూడా జోడించనుంది. సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ మార్పులు తదితర కారణాల వల్ల ప్రస్తుతం నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ నంబరు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా దేశవ్యాప్తంగా ఈ నంబరును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం గట్టి పట్టుదలగా ఉంది.