బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (09:16 IST)

‘పళని’తో సంధికి పన్నీర్ సెల్వం రాయబారం: దినకరన్‌పై తిరుగుబాటుకు సీఎం సై

రాజకీయం రసకందాయంలో పడిందంటే ఇప్పుడు తమిళనాడు పరిణామాలకు మించిన ఉదాహరణ మరొకటి ఉండబోదు. శశికళ కొంప మునిగేలా, దినకరన్‌ను అన్నాడీఎంకే అమ్మ శిబిరం నుంచి తరిమికొట్టేలా శనివారం ఒక అనూహ్య పరిణామం తమిళనాడులో సంచలనం కలిగించింది.

రాజకీయం రసకందాయంలో పడిందంటే ఇప్పుడు తమిళనాడు పరిణామాలకు మించిన ఉదాహరణ మరొకటి ఉండబోదు. శశికళ కొంప మునిగేలా, దినకరన్‌ను అన్నాడీఎంకే అమ్మ శిబిరం నుంచి తరిమికొట్టేలా శనివారం ఒక అనూహ్య పరిణామం తమిళనాడులో సంచలనం కలిగించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నమ్మినబంటు పన్నీర్ సెల్వం ఒక మెట్టు దిగివచ్చి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామితో సఖ్యతకు రాయబారం పంపడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఐటీ ఉచ్చులో చిక్కుకున్న అధికార పార్టీ ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ రాజీనామా విషయంలో నిలువునా చీలిపోయిన నేపథ్యంలో దినకరన్ పెత్తనాన్ని అరికట్టేందుకు అన్నాడీఎంకై వైరి వర్గాలు ఏకం కావడం ఉత్కంఠ కలిగిస్తోంది.
 
ఆర్కేనగర్‌లో ఎలాగైనా సరే గెలువుసాధించి అటు ప్రత్యర్థి  పన్నీర్ సెల్వం, ఇటు ప్రతిపక్షం డీఎంకేకి వాటి స్థానం ఏమిటో చూపించాలని ప్రతిష్టకుపోయి అధికార పార్టీ బరితెగించి చేసిన ప్రయత్నం శశికళ కొంప ముంచనుందా అంటే అవునంటున్నారు తమిళ రాజకీయ విశ్లేషకులు. ఆర్కేనగర్‌లో అమ్మ శిబిరం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌‌ గెలుపుకోసం దాదాపు 90 కోట్ల రూపాయలను అధికార పార్టీకి చెందిన ఏడెనిమిది మంత్రులు ఓటర్లకు పంచి పెట్టిన వ్యవహారం బట్టబయలై ఐటీ ఉచ్చుబిగించింది. 
 
ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ రాజీనామా డిమాండ్‌ అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో వివాదాన్ని రేపింది. రాజీనామా చేయించే ప్రయత్నంలో సీఎం, అడ్డుకునే ప్రయత్నంలో టీటీవీ దినకరన్‌ ముందుకు సాగుతుండడంతో ఆ ఇద్దరి మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఈ విభేదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో బిజీ అయ్యారు. అమ్మ శిబిరం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు, సీఎం ఎడపాడి పళనిస్వామి మధ్య ఇంటి పోరు రచ్చకెక్కిన సమాచారంతో మాజీ సీఎం పన్నీరుసెల్వం పావులు కదిపే పనిలో పడ్డారు. పళనితో సంధికి ప్రయత్నాల్లో పడ్డట్టున్నారు. టీటీవీకి చరమగీతం పాడి సఖ్యతగా అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడిపిద్దామన్న సంకేతాన్ని సీఎంకు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. 
 
చిన్నమ్మ శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న దృష్ట్యా, ఇక, సీనియర్లను తొక్కి పెట్టి పార్టీలో ప్రస్తుతం పెత్తనం సాగిస్తున్న దినకరన్‌ను ఇదే అదునుగా సాగనంపే వ్యూహాన్ని రచించినట్టు సమాచారం. ఇందుకుగాను, ఎడపాడి పళనిస్వామితో చేతులు కలిపి, దినకరన్‌ను బయటకు పంపించడమే కాకుండా, అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని ఇద్దరం కలిసి కట్టుగా నడిపిద్దామన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
 
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, అదే సమయంలో పార్టీకి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే, సఖ్యతగా ముందుకు సాగుదామన్న సఖ్యత మంత్రాన్ని సీనియర్‌ మంత్రుల చెవిలో పురట్చి తలైవీ శిబిరం నేతలు వేశారు. సీఎం పళని స్వామి దృష్టికి తీసుకెళ్లి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనను చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయం శుక్రవారం రాత్రి సీఎం ఎడపాడి పళనిస్వామి ఇంట్లో జరిగిన మంతనాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
 
ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ చేత రాజీనామా చేయించే విషయంగా దినకరన్‌తో భేటీ అనంతరం సీనియర్‌ మంత్రులు ఎడపాడితోనూ సమావేశం అయ్యారు. విజయభాస్కర్‌ దగ్గర రాజీనామా చేయించడం లేదా, తొలగించడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎంకు ఆ సీనియర్లు సూచించారు. ఏదేని సమస్య ఎదురైన పక్షంలో ఎదుర్కొందామని, ఢీ కొడదామన్న భరోసాను ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో సీనియర్లు, పన్నీరు శిబిరం నుంచి వచ్చిన సఖ్యత సందేశాన్ని ఉపదేశించారు.
 
దీనిని ఆసక్తిగా విన్న సీఎం, ముందు విజయభాస్కర్‌ విషయాన్ని తేలుద్దామని, తదుపరి మిగతావి చూసుకుందామన్న వ్యాఖ్యల్ని పలికినట్టుగా పన్నీరు శిబిరానికి సమాచారం చేరి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అమ్మ శిబిరంలో రచ్చకెక్కిన ఇంటి పోరు మున్ముందు ఎలాంటి పరిణామాలకైనా దారి తీయవచ్చు. శశికళ, దినకరన్ వ్యతిరేక వ్యూహంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి గ్రూపులు ఒక్కటైనా ఆశ్చర్య పడాల్సిన పని లేదన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు.