సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:03 IST)

పని ఒత్తిడి.. డాక్టర్ చెంప ఛెళ్లుమనిపించిన నర్సు... (వీడియో వైరల్)

కరోనా రోగులకు వైద్య సిబ్బంది నిద్రహారాలు లేకుండా సేవలు అందిస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు నియంత్రణ కోల్పోతున్నారు. తాజాగా ఓ నర్సు పని ఒత్తిడి కారణంగా వైద్యుడిపై చేయి చేసుకుంది. దీంతో ఆ వైద్యుడు కూడా నర్సుపై దాడికి దిగాడు. ఆ సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా పక్కనే ఉన్నప్పటికీ ఆయన మిన్నకుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రాగా, అది వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లా ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌కు, న‌ర్సుకు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఒక‌రిని ఒక‌రు బండ‌బూతులు తిట్టుకున్నారు. చివ‌రికి స‌హ‌నం న‌శించిన న‌ర్సు డాక్ట‌ర్ చెంప‌పై గ‌ట్టిగా కొట్టింది. దాంతో డాక్ట‌ర్ ఆమెపై దాడికి పాల్ప‌డ్డాడు.
 
కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసులు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా కూడా ఘ‌ట‌న‌పై ఇద్ద‌రిని వేర్వేరుగా విచారించారు. తాను కొట్లాడుతున్న‌ డాక్ట‌ర్‌, న‌ర్సు ఇద్ద‌రితో విడివిడిగా మాట్లాడాన‌ని, ఇద్ద‌రూ కూడా ప‌ని ఒత్తిడిని త‌ట్టుకోలేక‌నే తాము స‌హ‌నం కోల్పోయామ‌ని చెప్పార‌ని తెలిపారు. ఘ‌ట‌న‌పై త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌న్నారు.