కరోనా వైరస్ సోకి ఇంట్లో మరణించినా పరిహారం అందిస్తాం..
కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆస్పత్రిలోనే కాదు.. ఇంట్లో మరణించినా కూడా పరిహారం అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇంట్లో మరణిస్తే వైద్యుడి ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాల్సి వుంటుందని తెలిపింది. రోగి కరోనాతో మృతి చెందారు అంటూ వైద్యుడు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందుపరచాలని సూచించింది. దీని ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
సాధారణంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 25 రోజుల్లోపే 95 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌గా తేలిన తేదీ నుంచి 30 రోజుల్లోపు సంభవించే మరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో నెల దాటిన తర్వాత కూడా మహమ్మారితో మరణిస్తున్నారు. వైద్యుడు ధ్రువీకరిస్తే అటువంటి వారికి పరిహారం అందించాలని సూచించింది.
కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించింది. అయితే.. ఇవి ప్రాథమిక మార్గదర్శకాలేననీ, పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన తరవాతే పరిహారం అంశంపై దృష్టి పెడతామని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.