జమిలి ఎన్నికలకు సిద్ధం.. చెప్పడమే తరువాయి : ఈసీ
'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' అనే నినాదంలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. అయితే దాని కంటే ముందు పార్టీలన్నీ ఒక్కతాటిపైకి
'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' అనే నినాదంలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. అయితే దాని కంటే ముందు పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు.
వచ్చే యేడాది సెప్టెంబరు తర్వాత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఈసీ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఓపీ రావత్ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. దీనివల్ల ప్రభుత్వాలు తమ అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించే వీలుంటుంది. ఎన్నికల కోడ్‌లాంటివి అడ్డు రావు అని రావత్ అన్నారు.
అయితే ఇది జరగాలంటే రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అవి పూర్తయిన తర్వాత ఆరు నెలలకు ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి రావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా ఎన్నికలు 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించాల్సి ఉంది. జమిలి ఎన్నికల కోసం ఎన్నికల సంఘానికి సుమారు 48 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్ మెషిన్లు అవసరం అవుతాయన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.