బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (11:08 IST)

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కాంగ్రెస్ లేవనెత్తే సందేహాలు ఇవే...

haryana state
హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరంభ ట్రెండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంలో ఉండగా, చివరకు విజయం మాత్రం భారతీయ జనతా పార్టీని వరించింది. ఫలితంగా హర్యానా రాష్ట్రంలో బీజేపీ హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
అయితే, ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలకు కూడా అందలేదు. ఏమాత్రం ఊహించని హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఊహించని రీతిలో, షాక్‌కు గురిచేసేలా ఈ ఫలితాలు ఉన్నాయని, అంగీకరించలేని విధంగా ఉన్నాయని హస్తం పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. 
 
గంటల వ్యవధిలో ఫలితాలు తారుమారు అయ్యాయని చెబుతోంది. ఈ మేరకు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఒక లేఖ రాసింది. హర్యానా ఎన్నికల ఫలితాల అప్ డేటింగ్ ప్రక్రియ వర్ణించలేనంత మందకొడిగా కొనసాగిందంటూ ఆరోపించింది. 
 
'ఈ తరహా విధానాలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను తగ్గిస్తాయని మీరు కూడా ఊహించవచ్చు. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఉదాహరణలను మీరు గమనించవచ్చు. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న చోట ప్రభావం పడుతుంది' అని ఈసీకి రాసిన లేఖలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టివేసింది. ప్రతి ఐదు నిమిషాలకు అప్డేట్ చేస్తున్నామని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 90 నియోజకవర్గాలు ఉండగా ప్రతి 5 నిమిషాలకు 25 రౌండ్ల ఫలితాలను అప్డేట్ చేసినట్టు పేర్కొంది. 
 
కాగా, ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న సందేహాలను పరిశీలిస్తే, ఈవీఎంలతో పాటు ఎన్నికల కౌంటింగ్లో స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని మీడియా సమావేశంలో జైరాం రమేష్ ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారు కావడంతో డబుల్ ఇంజిన్ ఒత్తిడి చేశారని, అందుకే తమ అభ్యర్థులు 50, 100, 250 ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తుచేశారు.