శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 11 మార్చి 2017 (05:20 IST)

పార్టీల గుండె చప్పుడును పెంచనున్న కౌంటింగ్: మధ్యాహ్నం 11 గంటలకు తొలిపలితం

దేశ భవిష్యత్ రాజకీయాలను సమూలంగా మార్చివేయనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ మరో మూడు గంటల్లో ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ పార్టీలలో ఉత్కంఠను మరింత పెంచదా అసలు

దేశ భవిష్యత్ రాజకీయాలను సమూలంగా మార్చివేయనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ మరో మూడు గంటల్లో ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ పార్టీలలో ఉత్కంఠను మరింత పెంచదా అసలు ఫలితాలకు ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు కళ్లలో ఒత్తులు పెట్టుకుని మరీ చూస్తున్నారు.

 
నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలే మిగిలింది. కీలకమైన యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. రాజ్యసభలో మెజారిటీ దక్కాలంటే కమలం పార్టీకి విజయం అత్యంత అవసరం. అటు ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి అస్తిత్వం నిలుపుకునేందుకు ఈ ఎన్నికలు క్రియాశీలకం.
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్ర పొద్దుపోయేంత వరకూ జరగవచ్చని తెలుస్తోంది. తొలిఫలితం మధ్యాహ్నం 11 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది. 12 గంటల కల్లా ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ హవా నడుస్తోందనే విషయమై స్పష్టత రావచ్చు. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 157 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంజాబ్‌లో 53, గోవాలో 2, యూపీలో 75, ఉత్తరాఖండ్‌లో 15, మణిపూర్‌లో 12 కౌటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలుత అరగటంలో పోస్టర్ బ్యాలెట్ల లెక్కింపు జరిపి అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోలింగ్ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నట్టు సీఈసీ నసీమ్ జైది తెలిపారు.
 
ప్రధాన  మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి రెఫరెండంగా భావిస్తున్న ఈ ఫలితాలపై  ఉత్కంఠ నెలకొంది. ఎక్కువసీట్లున్న యూపీలో బీజేపీ అధిక సీట్లు గెలిచే వీలున్నప్పటికీ.. హంగ్‌ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని నిపుణులంటున్నారు.
 
పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటుగా ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో అధికారాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. అటు ఢిల్లీ బయట తొలిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌పై విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. బిహార్‌ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినప్పటికీ.. మహాకూటమే గెలిచిన విషయాన్ని లాలూ గుర్తుచేశారు.
 
ఉత్తరప్రదేశ్‌ : మొత్తం సీట్లు 403 ..  మేజిక్‌ ఫిగర్‌ 202
పంజాబ్‌: మొత్తం సీట్లు..117 .. మేజిక్‌ ఫిగర్‌ 59
ఉత్తరాఖండ్‌: మొత్తం సీట్లు 71 .. మేజిక్‌ ఫిగర్‌ 36
మణిపూర్‌: మొత్తం సీట్లు 60 .. మేజిక్‌ ఫిగర్‌ 31
గోవా: మొత్తం సీట్లు 40 ..  మేజిక్‌ ఫిగర్‌ 21