శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (14:43 IST)

ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరి రంగన్ కన్నుమూత

kasturi rangan
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) (ISRO) మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ (Kasturi Rangan) ఇకలేరు. ఆయనకు వయసు 84 యేళ్ళు. ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఈయన శుక్రవారం ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కస్తూరి రంగన్ 1990 నుంచి 1994 వరకు యూఆర్‌ఏసీ డైరెక్టరుగా పని చేశారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు అంటే 1994 నుంచి 2003 వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు వేసింది. 
 
జేఎన్‌యూ చాన్సలర్‌గా, కర్నాటక రాష్ట్ర నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా కూడా ఆయన పని చేశారు. 2003-09 మధ్యకాలంలో ఆయన రాజ్యసభ సభ్యుడుగా, ప్రణాళికా సంఘం సభ్యుడుగా కూడా సేవలు అందించారు. అలాగే, 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగుళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టరుగా కూడా పని చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడుగా కూడా పని చేశారు.