దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీల ఫోటోలు.. ఆలయాల్లో రద్దీ..!
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రజలు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు, ఫలాలు, పుష్పాలను సమర్పించుకుని పూజలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రజలు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు, ఫలాలు, పుష్పాలను సమర్పించుకుని పూజలు చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా ముంబయి నగరంలోని పలువురు బాలీవుడ్ నటీనటులు బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు సెలబ్రిటీలు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ గణపతి విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్ఠించి పూజలు చేశారు. హీరో వివేక్ ఒబేరాయ్ గణపతి విగ్రహాన్ని తీసుకెళుతూ ఫోటోలకు ఫోజిచ్చారు. బాలీవుడ్ నటుడు జితేంద్ర తన కుటుంబసభ్యులతో కలిసి వినాయకుడిని పూజించారు. సల్మాన్ ఖాన్ తన సోదిరి అర్పితాఖాన్, అల్విరాఖాన్‌లతో కలిసి గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. వినాయకుడి పూజలు జరిపిన బాలీవుడ్ నటుల్లో సోనాలీ బింద్రే,సోనూసూద్, తుషార్ కపూర్‌లు తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే వినాయక ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఖైరతాబాద్‌లో ఈసారి 58 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ దంపతులు ఇక్కడ తొలిపూజ చేయనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్.. ఖైరతాబాద్ గణేశుడికి 500 కిలోల లడ్డూను తయారుచేసింది. విజయవాడలో 72 అడుగుల డుండీ గణేషుడిని ఏర్పాటుచేశారు. విశాఖలోని గాజువాకలో 78 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేయడం విశేషం.