శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రాకేష్ తికాయత్ ఎంతకైన దిగజారుతారు : బీజేపీ ఎమ్మెల్యే

రైతు సంఘాల నేతగా చెప్పుకునే రాకేష్ తికాయత్‌పై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రైతు మద్దతుదారేమీ కాదని, డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారని అన్నారు. చివరకు రూ.2 వేలు ఇస్తే, ఎక్కడికైనా వెళ్లిపోయి, అక్కడ ఉన్న ఎవరినైనా రెచ్చగొట్టేలా మాట్లాడటం ఆయన ప్రత్యేకతని ఆరోపించారు. 
 
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి రాకేశ్ తికాయత్ నేతృత్వం వహిస్తున్నారు. దీంతో ఆయన్ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. 
 
ఇదే అంశంపై గుర్జార్ మాట్లాడుతూ, అతను తనను తాను రైతు కన్నా అధికంగా భావిస్తున్నాడని, భారతీయ కిసాన్ యూనియన్ పేరిట, అతను డబ్బులు దండుకుంటాడని ఆరోపించారు. 
 
"నేను ఓ రైతును. నాకన్నా పెద్ద రైతునని అతను అనుకుంటాడు. నాకున్న భూమిలో అతనికి సగం కూడా లేదు. తికాయత్ క్షమాపణలు చెప్పాల్సిందే. దేశంలోని రైతులను అతను విభజిస్తున్నాడు. చరిత్ర అతన్ని క్షమించదు" అని తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కిశోర్ గుర్జార్ అన్నారు.
 
రైతు నిరసనకారులు విధ్వంసానికి దిగడానికి అతనే కారణమని ఆరోపించిన గుర్జార్, ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్నది అసలు రైతుల నిరసనే కాదని అన్నారు. ఎవరు అక్కడికి వెళ్లి చూసినా, కేవలం రాజకీయ పార్టీలకు చెందిన నలుగురైదుగురే కనిపిస్తారని చెప్పారు.