శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బిచ్చగాళ్లు కూడా దేశం కోసం పని చేయాలి : బాంబే హైకోర్టు

బిచ్చగాళ్లు, నిరాశ్రయులు కూడా దేశం కోసం ప‌నిచేయాల‌ని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వాళ్ళకు రాష్ట్ర ప్ర‌భుత్వమే అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌ని ఓ కేసులో హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ మేరకు చీఫ్ జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తా, జ‌స్టిస్ జీఎస్ కుల‌క‌ర్ణిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం వ్యాఖ్యలు చేసింది.
 
బ్రిజేశ్ ఆర్య అనే వ్యక్తి బిచ్చగాళ్ళ గురించి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.అనాథ‌లు, బిచ్చ‌గాళ్ల‌కు మూడు పూట‌ల పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని, శుద్ద‌మైన తాగునీటి, క్లీన్ టాయిలెట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఎన్జీవోల సాయంతో అనాథ‌లు, బిచ్చ‌గాళ్ల‌కు ఆహార పొట్లాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కోర్టుకు చెప్పింది. మ‌హిళ‌ల‌కు శానిట‌రీ నాప్కిన్లు ఇస్తున్న‌ట్లు కూడా ఎంబీసీ కోర్టుకు తెలిపింది. 
 
ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్పందిస్తూ.. నిరాశ్ర‌యులు కూడా దేశం కోసం ప‌నిచేయాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌నిచేస్తున్నార‌ని, అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వమే ఇవ్వ‌ద‌ని, ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ సెక్ష‌న్ జనాభాను పెంచుతున్న‌ట్లు అవుతుంద‌ని కోర్టు పేర్కొన్న‌ది.
 
పిటిష‌న్‌లో పేర్కొన్న అంశాల‌న్నింటినీ తీరిస్తే అప్పుడు ఇక వాళ్లు ఏమీ ప‌నిచేయ‌లేర‌ని కోర్టు వెల్ల‌డించింది. ఇండ్లు లేని వాళ్లకు ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను ఉచితంగా వాడుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. పిటిష‌న్‌లో నిరాశ్ర‌యులు ఎవ‌ర‌న్న అంశం స‌రిగా లేద‌ని, ఎంత మందికి న‌గ‌రంలో ఇండ్లు లేవ‌న్న విష‌యాన్ని కూడా పేర్కొనలేద‌ని ధ‌ర్మాసనం అభిప్రాయ‌ప‌డింది.