స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)
ఇదివరకు 50 ఏళ్ల పైబడినవారికి గుండెపోటు వంటివి వచ్చి హఠాన్మరణం చెందే సంఘటనలు చూస్తుండేవాళ్లం. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా గుండెపోటు సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందింది.
స్కూలు ఆవరణకు రాగానే చిన్నారి తన ఛాతీలో నొప్పిగా వుందని చెప్పింది. ఇంతలో మిగిలిన విద్యార్థులతో కలిసి కారిడార్లో నడుస్తూ వెళ్లి అస్వస్థతగా వుండటంతో కుర్చీలో కూర్చున్నట్లు సిసి కెమేరాలో కనబడుతోంది. అలా కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. చిన్నారికి అనారోగ్య సమస్యలు ఏవీ లేవని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.