ఎద్దుకు అంత్యక్రియలు - గ్రామస్థులపై పోలీస్ కేసు
తమిళ సంప్రదాయంలో మిళితమైన క్రీడ జల్లికట్టు ఒకటి. ఈ క్రీడా పోటీలను సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో ఈ క్రీడకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పైగా, ఈ క్రీడలో పాల్గొనే ఎద్దులను ఒక యేడాది నుంచి సిద్ధం చేస్తుంటారు. అలా ప్రతి యేటా జల్లి కట్టు క్రీడలో పాల్గొనే ఎద్దు ఒకటి చనిపోయింది. దీనికి ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.
మదురై జిల్లాలోని అలంగానల్లూరులో ప్రతి యేటా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఓ ఎద్దు చనిపోయింది. దానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఆ ఊర్లోని వందలాది మంది గుమిగూడారు. ఎద్దు మృతదేహాన్ని పూలతో కప్పి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇలా చేయడం ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలకు విరుద్ధం. అందుకే ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదురై జిల్లా కలెక్టర్ టీజీ వినయ్ తెలిపారు.