ఈ ఏడాది హైదరాబాద్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆగస్టు 11 నుంచి 16 వరకూ జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు బీడబ్ల్యూఎఫ్ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) నిర్ణయించింది.
మహమ్మారి సృష్టించిన అనిశ్చితి నుంచి ఎప్పటికి బయటపడతామో తెలియని కారణంగా టోర్నీని రద్దు చేస్తున్నామని, తాము తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అంగీకరించిందని తెలిపింది.
ఇక బీడబ్ల్యూఎఫ్ ఇతర దేశాల్లో నిర్వహించాల్సిన టోర్నీలపై సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటామని సమాఖ్య కార్యదర్శి థామస్ లాండ్ వెల్లడించారు.
సమాఖ్య తీసుకున్న నిర్ణయంపై స్పందించిన జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా హైదరాబాద్ లో టోర్నీని నిర్వహించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.