ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (16:50 IST)

అమ్మకు సన్నిహితుడు రామ్మోహన్‌రావు.. అమ్మ పథకాల రూపకర్త ఇతనే.. ఓపీ పదవి గోవిందా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రస్తుత తమిళనాడు సీఎస్‌గా పని చేస్తున్న రామ్మోహన్ రావు చాలా సన్నిహితుడు. ఆమెకే కాదు.. ఆమె నెచ్చెలి శశికళ, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు రామ్మోహన్ రావు ఆర్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రస్తుత తమిళనాడు సీఎస్‌గా పని చేస్తున్న రామ్మోహన్ రావు చాలా సన్నిహితుడు. ఆమెకే కాదు.. ఆమె నెచ్చెలి శశికళ, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు రామ్మోహన్ రావు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అయితే ఆయన ఇంటిపై బుధవారం ఐటీ దాడులు జరగడం వివాదాస్పదమైంది. తమిళ సీఎం పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టేందుకే రామ్మోహన్ రావు ఇంటిపై దాడులు జరిగాయా? ఢిల్లీకి పన్నీర్ సెల్వం వెళ్లినప్పుడు ఏం జరిగింది. మరోవైపు ఐటీ దాడులపై డిఎంకే తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టింది.
 
తమిళనాడు సీఎస్‌గా పని చేస్తున్న రామ్మోహన్ రావు అమ్మ పాలనలో కీలక పాత్రను పోషించారు. అంతేగాకుండా గ్రాండ్ సక్సెస్ అయిన అమ్మ పథకాలను రూపొందించేది ఆయనే. ఇక మొన్న ఐటీ దాడుల్లో పట్టుపడ్డ శేఖర్ రెడ్డికి ఆప్తమిత్రుడు రామ్మోహన్ రావు కావడంతోనే ప్రస్తుతం ఐటీ దాడులు ఆయన ఇంటిపై దాడి చేస్తోంది. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు దగ్గరుండి ప్రభుత్వాన్ని నడిపించిన రామ్మోహన్ రావు ఆపై పన్నీర్ సెల్వం సీఎం అవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక శశికళ ముఖ్యమంత్రి కావాలంటూ పార్టీ నేతలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న తరుణంలో రామ్మోహన్ రావు, పన్నీర్ సెల్వంకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. అంతేకాదు. ఇటీవల సీఎంతో కలిసి ఢిల్లీ కూడా వెళ్లారు.
 
ప్రధాని మోదీని కలిసినప్పుడు పన్నీర్ సెల్వం, శశికళ గురించి అనుకూలంగా చెప్పలేదని, రామ్మోహన్ రావు కూడా పన్నీర్ సెల్వం మాటలను సమర్థించినట్లు తెలియవచ్చింది. ఈ భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకే పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టే దిశగా కుట్ర జరుగుతున్నట్లు సమాచారం.
 
పనిలో పనిగా ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు శశికళకు సభ్యత్వ కాలం ఆటంకమయ్యేలా వుండడంతో, పార్టీ నిబంధనలను కూడా మార్చేందుకు నేతలు సిద్ధమయ్యారు.ఇదే సమయంలో శశికళే పగ్గాలు చేపట్టాలంటూ పార్టీకి చెందిన జిల్లా కార్యవర్గాలు, వివిధ విభాగాల వారు ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి అధిష్ఠానానికి పంపేందుకు పోటీ పడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం శశికళను అన్నాడీఎంకే అధినేత్రిని చేయకూడదంటున్నారు. 
 
కానీ పార్టీ సీనియర్లంతా ఈ నెలాఖరు లోపు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం ఖాయమైపోవాలనుకుంటున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళకు అడ్డుగా వున్న ఆటంకాలన్నీ తొలగిపోవడంతో ఆమె సన్నిహితులు ఇప్పుడు సీఎం పీఠంవైపు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి పీఠంపై శశికళను కూర్చోబెట్టే వ్యూహంలో భాగంగా మెల్లిగా పావులు కదపడం ప్రారంభించారు. దీంతో పన్నీరు సీఎం సీటు ఖాళీ చేయాల్సిందేనని ఆయన వ్యతిరేకులు చెప్తున్నారు అయితే మరోవర్గం పన్నీర్‌ సెల్వం ఈ సారి పూర్తికాలం పదవీలో ఉండేలా చూసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. ఇక ఓపీ పదవి ఉంటుందో ఊడుతోందో?