ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (10:47 IST)

ఇండోచైనా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి : విదేశాంగ మంత్రి జైశంకర్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవలి కాలంలో భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నట్టు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత మూడు నాలుగు దశాబ్దాలతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఆస్ట్రేలియాకు చెందిన లోఈ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి చైనా వేల సంఖ్యలో సైన్యాన్ని మోహరించిందని, ఇదేంటని ప్రశ్నిస్తే ఐదు పొంతన లేని సమాధానాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 
 
ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమనేది చాలా పెద్ద విషయమే కాదు.. ఓ సవాల్‌తో కూడుకున్నపనిగా ఉందన్నారు. ముఖ్యంగా, గాల్వాన్ లోయ ఘటన చైనాపై భారత్‌లో వ్యతిరేకతకు కారణమైందన్నారు. 
 
ఈ ఘటన దేశ ప్రజల సెంటిమెంట్‌లో మార్పు తీసుకొచ్చిందని జైశంకర్ గుర్తుచేశారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. అలాగే, చైనా వైపున కూడా భారీ సంఖ్యలో సైనిక ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ మాత్రం నోరుమెదపడం లేదు. ఫలితంగా చైనాపై భారత్ సోషల్ మీడియా వార్ ప్రకటించింది.