కరోనా రికవరీ రేటులో వృద్ధి.. మరణాల్లో తగ్గుదల : ఆరోగ్య శాఖ
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ దెబ్బకు అనేక అగ్రరాజ్యాలు తల్లడిల్లిపోయాయి. అయితే, ఈ వైరస్ మన దేశంలో విస్తృతంగా వ్యాపించకుండా కేంద్ర ఆరోగ్యం శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఫలితంగా మన దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసు సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే తక్కువనే చెప్పొచ్చు. ఇదే విషయంపై ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటివరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 97.31శాతం మంది కోలుకున్నారని తెలిపింది. ఇంత రికవరీ రేటు సాధించిన దేశాలు ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. గతేడాది అక్టోబరు 1 నుంచి దేశంలో కరోనా మరణాల సంఖ్య తగ్గుతూనే వచ్చిందని తెలిపింది.
ఆదివారం నాటికి ఇది కేవలం 1.43 శాతమే ఉందని పేర్కొంది. కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని వివరించింది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. యూఎస్‌లో సుమారు 5 లక్షల మంది కరోనాకు బలయ్యారు. అమెరికాతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా మరణాలు సగానికంటే తక్కువ.