1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మళ్లీ రాఫెల్ రగడ : దర్యాప్తు ప్రారంభించిన ఫ్రాన్స్ - భారత్‌లో అలజడి

ఫ్రాన్స్, భారత్ దేశాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాల్లో భాగంగా రూ.59 వేల కోట్ల వ్యయంతో యుద్ధ విమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇం1దులోభాగంగా, ఇప్పటికే ఐదు విమానాలు భారత్‌కు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ దుమారం చెలరేగింది. 
 
రూ.59 వేల కోట్లతో 36 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించడం భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. న్యాయ విచారణకు ఫ్రాన్స్‌ ప్రత్యేకంగా ఓ న్యాయమూర్తిని నియమించినట్టు ఆ దేశానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. 
 
2016లో కుదిరిన ఈ ఒప్పందంపై గతనెల 14వ తేదీనే ఫ్రాన్స్‌ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది. డీల్‌ కుదిర్చినందుకు రాఫెల్‌ తయారీ సంస్థ దసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌కు చెందిన మధ్యవర్తికి (సుషేన్‌ గుప్తా-అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంలోనూ నిందితుడు ) సుమారు 10 కోట్ల ముడుపులు చెల్లించినట్టు గత ఏప్రిల్‌లో మీడియా పార్ట్‌ కథనాన్ని ప్రచురించింది. 
 
ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ ఆడిటింగ్‌లో ఈ విషయం బయటపడినట్టు తెలిపింది. ‘గిఫ్ట్‌ టు క్లయింట్స్‌’ కింద ఆ సంస్థ భారీగా ఖర్చును చూపించినట్టు పేర్కొన్నది. 50 రాఫెల్‌ నమూనాలను తయారు చేయించేందుకే సుషేన్‌గుప్తాకు చెందిన డెఫిసిస్‌ సొల్యూషన్స్‌ కంపెనీకి ఆ మొత్తం చెల్లించినట్టు దసాల్ట్‌ పేర్కొన్నా.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని తెలిపింది. 
 
ఈ కథనాలతోపాటు ఆర్థిక నేరాల పరిశోధనలో ప్రావీణ్యమున్న షెర్పా అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్స్‌ (పీఎన్‌ఎఫ్‌) కార్యాలయం దర్యాప్తు ప్రారంభించిందని మీడియా పార్ట్‌ వెల్లడించింది. వాస్తవానికి 2018లోనే పీఎన్‌ఎఫ్‌కు మొదటి ఫిర్యాదు రాగా, అప్పటి పీఎన్‌ఎఫ్‌ చీఫ్‌ దాన్ని తొక్కి పెట్టారని ఆరోపించింది.