'గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ' ఇకలేరు...
దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్టు ఇకలేరు. ఆమె పేరు డాక్టర్ ఎస్. పద్మావతి. ప్రముఖ హృద్రోగ నిపుణురాలు. నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఎన్.హెచ్.ఐ) ఆస్పత్రి వ్యవస్థాపకురాలు. ఈమె 103 యేళ్ల వయసులో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ సోకిన ఈమె 11 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఢిల్లీలోని పంజాబీ బాఘ్‌లో సోమవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
దేశంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డా. పద్మావతిని 'గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ'గా ప్రఖ్యాతి గడించారు. 1917లో బర్మా (మయన్మార్)లో ఈమె జన్నించారు. అంటే సరిగ్గా స్పానిష్ ఫ్లూ మహమ్మారి విజృంచడానికి ఏడాది ముందు పద్మావతి జన్మించారు. మళ్లీ వందేళ్ళ తర్వాత వచ్చిన మరో మహమ్మారి బారినపడి ఆమె మరణించడం విధి వైచిత్యంగా భావించొచ్చు.
కాగా, ఈమె రంగూన్ వైద్య కాలేజీలో వైద్య విద్యను పూర్తిచేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1942లో భారత్‌కు వలస వచ్చారు. అనంతరం విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేశారు. కోర్సు పూర్తయిన తర్వాత భారత్‌కు చేరిన పద్మావతి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో అధ్యాపకురాలిగా చేరారు.
1962లో ఆలిండియా హార్ట్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 1981లో ఆధునిక వసతులతో ఢిల్లీలో ఎన్‌హెచ్ఐని స్థాపించారు. దీంతో అది దక్షిణార్థ గోళంలోనే ప్రైవేట్ రంగంలో నెలకొల్పిన మొదటి కార్డియాక్ క్యాథెటరైజేషన్ ప్రయోగశాలగా గుర్తింపుపొందింది.
కార్డియాలజీ విభాగంలో ఆమె సేవలకు గుర్తింపుగా డా.పద్మావతి అనేక పురస్కారాలను అందుకున్నారు. అమెరికన్ కార్డియాలజీ కాలేజీ నుంచి ఫెలోషిప్ అందుకున్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వం 1967లో పద్మ భూషణ్, 1992లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ఆమెను సత్కరించింది.