శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (02:04 IST)

ఇన్ఫోసిస్ మూర్తిగారే చెబుతున్నారు. ఇక హెచ్1-బి వీసాలు మర్చిపోవలసిందేనా?

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిజంగానే బహుళ సంస్కృతులకు వీలిచ్చే కంపెనీలుగా మారిపోవల్సిందేనా. మన సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇకనుంచి అమెరికాలో అమెరికా ప్రజలను, కెనడాలో కెనడియన్లను, బ్రిటన్‌లో బ్రిటిష్ ప్రజలను ఉద్యోగాల్లో నియమించుకోవలసిందేనా? భారత కంపెనీలు ని

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిజంగానే బహుళ సంస్కృతులకు వీలిచ్చే కంపెనీలుగా మారిపోవల్సిందేనా. మన సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇకనుంచి అమెరికాలో అమెరికా ప్రజలను, కెనడాలో కెనడియన్లను, బ్రిటన్‌లో బ్రిటిష్ ప్రజలను ఉద్యోగాల్లో నియమించుకోవలసిందేనా? భారత కంపెనీలు నిజమైన మల్టీ నేషనల్ కంపెనీలుగా మారాలంటే ఇది తప్ప మరో మార్గం లేదా.. అలా మారాలంటే హెచ్1-బి వీసాలను ఉపయోగించడం, భారతీయులను పెద్ద స్థాయిలో ఆయా దేశాలకు పంపించి సేవలందించడం ఇకనుంచి మానుకోవలిసిందేనా..? అమెరికాలో, ఇతర దేశాల్లో స్థానిక యువతకే ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చుకోవలిసిందేనా?  విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో మనవాళ్ల ఆశలపై చన్నీళ్లు చల్లుతున్న ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు ఒక తలపండిన పెద్దాయన. ఆయనెవరో కాదు ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్1-వి వీసాలపై కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు తమ రూట్ మార్చుకోవలసిందేనని ఇన్పోసిన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తేల్చి చెప్పేశారు. ఇకపై భారతీయ కంపెనీలు మరింత బహుళ సంస్కృతులకు వీలిచ్చే కంపెనీలుగా మారాలని, హెచ్1-బి వీసాలను ఉపయోగించడం మానాల్సిన అవసరం ఉందని మూర్తి చెప్పారు. విదేశాల్లో సేవలను అందించడానికి భారీ సంఖ్యలో భారతీయులను వీసాపై రప్పించి నియమించుకునే పద్ధతికి ఇక స్వస్థి చెప్పి స్థానికులకు ఉద్యోగాలు కల్పించి శిక్షణను ఇచ్చుకోవాలని మూర్తి సూచించారు.
 
భారతీయ కంపెనీలకు విదేశాల్లో విలువ ఏర్పడాలంటే స్థానిక కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకోవాలని, స్థానిక ప్రజలకు శిక్షణ ఇచ్చి మరింత మల్టీ కల్చరల్ కంపెనీలుగా మారాలని నారాయణమూర్తి హితవు చెప్పారు. అమెరికా నూతన ప్రభుత్వ యంత్రాంగం వైఖరితో స్టాక్ మార్కెట్లు ఎందుకు గజగజ వణుకుతున్నాయన్న ప్రశ్నకు మూర్తి సమాధానమిస్తూ.. భారతీయేతర నిపుణులతో పనిచేయడం భారత సంస్థలు నేర్చుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. 
 
భారతీయుల ఆలోచనా విధానం ఎల్లప్పుడూ  మృదు వైఖరితో ఉంటుందని, దానివల్లే మన కంపెనీలు బహుళ సంస్కృతుల కలబోతగా మారటం అంత సులభం కాదని మూర్తి పేర్కొన్నారు. మన మేనేజర్లు ఈదిశగా ప్రత్యేక ప్రయత్నాలు చేపట్టాలని, సీనియర్ ఉద్యోగులకు కూడా ఇది ఒక నేర్చుకునే అవకాశమిస్తుందని మూర్తి చెప్పారు. అధ్యక్షుడి కార్యనిర్వాహక ఆదేశం ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఇదొకటే మార్గమన్నారు. 
 
హెచ్-1బి వీసా అనేది కొన్ని ప్రత్యేక రంగాల్లో సైద్ధాంతిక, సాంకేతిక అనుభవం అవసరమైన ప్రత్యేక వృత్తుల్లో విదేశీ కార్మికులను, ఉద్యోగులను నియమించుకునే  అవకాశాన్ని అమెరికాలోని కంపెనీలకు అనుమతించే వలసేతర వీసా. ఈ వీసాపై ఆధారపడే మన సాంకేతిక కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను భారత్‌నుంచి రప్పించుకుని ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అమెరికా నూతన ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త హెచ్-1బి వీసా మౌలిక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇకనుంచి హెచ్ 1బి వీసా కలిగిన వారికి లక్షా 30 వేల వార్షికాదాయాన్ని కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నిపుణ కార్మికులకు ఇప్పుడిస్తున్న వేతనాలకంటే మూడింతలు అధిక వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీలు దీనికి సమ్మతించకపోతే అమెరికన్ పౌరులకు అవి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 
 
కానీ ఈ మొత్తం వ్యవహారంలో అందరూ మర్చిపోతున్నది ఒకటుంది. అమెరికా పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా మూలమూలలకు దూసుకెళ్లి అందినకాడికి ఇతర దేశాల సంపదలను దోచుకోవచ్చు. కానీ ఇతర దేశాల కంపెనీలు మాత్రం అలాంటి పనిచేయకూడదు. అంటే ఉపాధి భద్రత,  స్థానికులకు ప్రాముఖ్యత అనేవి తమకు మాత్రమే వర్తించేవి. ఇతర దేశాలకు వర్తించవు. దేశదేశాల మేధో సంపదను బ్రెయిన్ డ్రెయిన్ రూపంలో తరలించుకుపోయి అనంత సంపదలను సృష్టించి సొంతం చేసుకున్న అమరికాకు ఇప్పుడు సొంత ప్రజల ప్రయోజనాలు మాత్రమే గుర్తుకురావడం పరమ హాస్యాస్పదంగా ఉంది.