గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (11:12 IST)

దేశ వ్యాప్తంగా 420 మంది వైద్యులను మింగేసిన కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు 420 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు భారత వైద్య మండలి (ఐఎంఏ) వెల్లడించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు ఎంతటి ప్రాణాపాయ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారో ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. 
 
కరోనా రెండో దశ వ్యాప్తిలో ఇప్పటివరకు 420 మంది డాక్టర్లు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇందులో ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ వివరించింది. 
 
అత్యధికంగా బీహార్‌లో 96, ఉత్తరప్రదేశ్‌లో 41, గుజరాత్‌లో 31 మంది, తెలంగాణలోనూ 20 మంది, పశ్చిమ బెంగాల్‌లో 16, ఒడిశాలో 16, మహారాష్ట్రలో 15 మంది డాక్టర్లు కన్నుమూశారని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక చనిపోయిన డాక్టర్ల సంఖ్య 748కి పెరిగినట్టు ఐఎంఏ తెలిపింది.
 
మరోవైపు, దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సరళిపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరాలు తెలిపారు. దేశంలో కేవలం 7 రాష్ట్రాల్లోనే 10 వేలకు పైన కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. 
 
మరో రాష్ట్రాల్లో 5 వేల నుంచి 10 వేలకు మధ్యన పాజిటివ్ కేసులు వస్తున్నాయని వివరించారు. 6 రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలో కరోనా మరణాలు అధికంగా నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు. 
 
ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంఫోటెరిసిన్ బీ ఔషధానికి డిమాండ్ అధికం అవుతుండటంపైనా లవ్ అగర్వాల్ స్పందించారు. ఆంఫోటెరిసిన్ బి ఔషధం లభ్యత శుక్రవారం వరకు దేశంలో పరిమితంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధ లభ్యత, సరఫరాను పెంచుతున్నామని స్పష్టం చేశారు.
 
అదనంగా మరో 5 సంస్థలకు ఆంఫోటెరిసిన్ బి ఔషధం ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై ఫార్మా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కృషి చేస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఆంఫోటెరిసిన్ బి ఔషధాన్ని తయారుచేస్తున్న కంపెనీలు మరింత ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయని వివరించారు.