గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (09:35 IST)

45 నిమిషాల పాటు ఆగిన చిన్నారి గుండె.. ప్రాణం పోసిన వైద్య నారాయణులు

పుడుతూనే చిల్లుపడిన గుండెతో పుట్టాడా చిన్నారి. భూమ్మీద పడిన వెంటనే అతడి ఒళ్లు నీలిరంగులోకి మారడం ప్రారంభించింది. ఈ క్రమంలో 45 నిమిషాల పాటు అతడి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. నిలిచిన గుండెకు కృత్రిమ యాంత్రిక సర్క్యులేటరీ సపోర్ట్ సిస్టమ్‌ని అమర్చడం

పుడుతూనే చిల్లుపడిన గుండెతో పుట్టాడా చిన్నారి. భూమ్మీద పడిన వెంటనే అతడి ఒళ్లు నీలిరంగులోకి మారడం ప్రారంభించింది. ఈ క్రమంలో 45 నిమిషాల పాటు అతడి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. నిలిచిన గుండెకు కృత్రిమ యాంత్రిక సర్క్యులేటరీ సపోర్ట్ సిస్టమ్‌ని అమర్చడం ద్వారా ముంబై వాడా హాస్పిటల్ వైద్యులు ఒక్కమాటలో చెప్పాలంటే అతడిని చిరంజీవిని చేశారు. పైగా అతడు ఇప్పుడు పూర్తిస్థాయిలో మామూలు జీవితం గడపగలడని భరోసా కూడా ఇచ్చారు.
 
ఒక మనిషి ప్రాణం కాపాడటానికి, శ్వాస ఆడడం నిలిచిపోయిన మనిషిని మళ్లీ బతికించుకోవడానికి తపన పడిన ఒక మహా మానవోద్వేగాన్ని 30 ఏళ్లక్రితమే అబ్బీస్ అనే సినిమా ద్వారా చూశాం. ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టడానికి ముంబైలోని ఆ ఆసుపత్రి వైద్యులు అంతకు తక్కువ కృషి చేయలేదు. 
 
వివరాల్లోకి వెళితే, ధూలె ప్రాంతానికి చెందిన ఆరాధ్య వాగ్ అనే చిన్నారి పుడుతూనే గుండెకు రంధ్రంతో పుట్టాడు. పుట్టిన వెంటనే శరీరం నీలి వర్ణంలోకి మారసాగింది. అలాంటి పిల్లలకు గుండె నుంచి తాజా రక్తాన్ని శరీరంలోకి పంపించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న కారణంగా ఇలాంటి పిల్లలను బ్లూ బేబీస్ అంటారు.
 
ఆరాధ్య తండ్రి రవీంద్ర తన బిడ్డ పరిస్థితి గురించి ఇలా చెప్పాడు. పుడుతూనే గుండెకు చిల్లుతో పుట్టిన ఆరాధ్య గుండె శరీరానికి తగినంత రక్తాన్ని పంపి ఆక్సిజన్‌ను అందించలేదని డాక్టర్లు చెప్పారు. అతడిని బతికించే ఆవకాశాలు ధూలె ప్రాంతంలో లేకపోవడంతో కోటిఆశలతో ముంబై వచ్చాము అన్నారు. 
 
అలా అతడిని తీసుకుని వచ్చిన వెంటనే ముంబైలోని వాడియా హాస్పిటల్ వైద్య బృందం అత్యవసరమైన వైద్య ప్రక్రియ అయిన బీటీ షంట్ సర్జరీని నిర్విహించారు. శరీరంలోకి ఆక్సిజన్ సరఫరా పెంచడం దీనిపని. గత వారం ఈ ఆపరేషన్ చేశారు. కానీ 24 గంటల్లో ఆరాధ్య రక్తపోటు పడిపోయింది. అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే ఆసుపత్రిలోని వైద్య బృందం రంగంలోకి దిగింది.
 
అతడి గుండె మామూలుగా కొట్టుకునేలా చేయడానికి 26 గంటల సమయం పట్టింది. 45 నిమిషాల పాటు కృత్రిమంగా అతడి గుండె కొట్టుకునేలా చేయడానికి ప్రయత్నించాం. కానీ అది పని చేయలేదు. ఆ సమయంలో నేను అతడి గుండెకు నెమ్మదిగా మసాజ్ చేయసాగాను. 45 నిమిషాల తర్వాత అతడి గుండె కొట్టుకుని రక్తాన్ని సరఫరా చేయడం ప్రారంభించింది. ఆలా నిలిచిపోయిన గుండె మళ్లీ పని చేయడం మొదలెట్టగానే మొత్తం టీమ్ ఊపిరి పీల్చుకుంది అంటూ ఆసుపత్రి చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిస్వాస్ పాండా చెప్పారు. 
 
తల్లి కడుపులోనే ఆరాధ్యకు గుండె సమస్య ఉన్నట్లు కనుగొన్నారు. అలాంటి స్థితిలో ఉన్న బిడ్డను కనడానికి చాలా కొద్ది మంది తల్లులు మాత్రమే నిర్ణయ తీసుకుంటారు. అతడు పుట్టగానే అతడి పరిస్థితి విషమంగా మారింది. ఎందుకంటే అతడి శరీరంలో ఆక్సిజన్ 50-60 శాతం మాత్రమే ఉండేది. పైగా అతడి గుండెకు ఇన్‌ఫెక్షన్ రావడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది అని డాక్టర్ బిశ్వాస్ అన్నారు. 
 
తాము ఆపరేషన ముగించిన రెండు రోజులకు ఆరాధ్య శరీరం మామూలుగా పనిచేయడం ప్రారంభించింది. అతడు మామూలుగా మూత్ర విసర్జన చేసాడు, మామూలుగా గుండెకొట్టుకోసాగింది. అతడికి పాలు ఇవ్వడం మొదలెట్టాము. వెంటిలేటర్ నుంచి కొద్ది రోజుల్లో బయటకు తీశాము అన్నారు. 
తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారినుంచి పైసాకూడా తీసుకోలేదని వైద్యులు చెప్పారు.
 
తాము పైసా చెల్లించలేని స్థితిలో ఉన్నా, తమ సొంత బిడ్డగా భావించి ఆసుపత్రి వైద్యులు వైద్య సహాయం అందించి మా బిడ్డ ప్రాణాలు కాపాడారని, వారి మేలు మర్చిపోలేమని తండ్రి రవీంద్ర చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు.