గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (07:26 IST)

కలియుగ మన్మథుడు : టెస్ట్ డ్రైవ్ చేస్తామని బైక్‌తో ఉడాయించిన లవర్స్...

అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'మన్మథుడు'. ఈ చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందంతో కలిసి ఓ షూ షాపుకు వెళ్లిన నాగార్జునలు ఓ చెప్పుల షాపులో బూట్లు తీసుకుని పరిగెత్తి చూస్తామని చెప్పి పారిపోతారు. అదే ట్రిక్కును ఉపయోగించి పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ ప్రేమ జంట ప్రయోగించింది. ఓ బైక్ షాపుకెళ్లిన ఈ జంట టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పి ఓ బైక్‌తో సహా పరారైంది. వారు వెనక్కి తిరిగి వస్తారని చూస్తూ కూర్చున్న షాప్ యజమానికి నిరాశే మిగిలింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జలంధర్‌లోని 'శివ ఆటో డీల్' షోరూమ్‌కు బుధవారం ఓ ప్రేమజంట బైక్ కొనుగోలు చేసేందుకు షోరూంకు వచ్చింది. ఆ షాప్ ఓనర్ సంజీవ్ వారికి పల్సర్ బైక్ చూపించి దాని విశేషాలు వివరించాడు. 
 
వారు టెస్ట్ డ్రైవింగ్ చేస్తామన్నారు. అందుకు సంజీవ్ అంగీకరించడంతో వారిద్దరూ ఆ బైక్‌ను తీసుకెళ్లారు. అయితే ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. వారు తీసుకెళ్లిన బైక్ నెంబర్, వారి ఫొటోలు సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపించారు.