గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (13:58 IST)

కేరళ పాలిట చీకటి మాసాలు - జూలై, ఆగస్టు నెలల్లో అతి పెద్ద విపత్తులు (Video)

kerala floods
'గాడ్స్ ఓన్ సిటీ' (దేవభూమి)గా ప్రసిద్ధిగాంచిన కేరళ రాష్ట్రాన్ని ప్రకృతి ప్రకంపనలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రతి జూలై - ఆగస్టు నెలలు ఆ రాష్ట్రం పాలిట చీకటి మాసాలుగా ఉన్నాయి. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో నమోదైన విపత్తుల్లో అతి పెద్దవి ఈ రెండు నెలల్లో సంభవించినవే. ఇటీవలి ఉదాహరణలే తీసుకుంటే.. 2020 ఆగస్టు 6న ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడిలో ఇదే తరహాలో భారీవర్గాలకు కొండచరియలు విరిగిపడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు.. 2019 ఆగస్టు 8న మలప్పురం, వయనాడ్, కోళికోడ్ జిల్లాల్లోని కవల పుర, పుదుమాల, విలంగాడ్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 76 మంది చనిపోయారు. వారిలో 16 మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. 
 
గత 2021లో ఇడుక్కి జిల్లాలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. ఇక.. 2018 ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదలపై ఒక సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వరదల్లో 483 మంది చనిపోయారు. 15 మంది మృతదేహాలు దొరకలేదు. ఆ వరదల దెబ్బకు.. 14 జిల్లాల పరిధిలో పది లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ యేడాది వర్షపాతం సాధారణం కంటే 23 శాతం అధికంగా ఉండటంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. 
 
దీంతో కేరళలోని 54 డ్యాముల్లో 35 డ్యాములను తెరిచి నీటిని వదిలేశారు. ఒకేసారి అన్ని డ్యాములను తెరవడం ఆ రాష్ట్ర చరిత్రలో అది తొలిసారి కావడం గమనార్హం. ఆ సమయంలో కేరళలో దాదాపు 5000 చిన్న, పెద్ద కొండ చరియలు విరిగిపడినట్టు ఒక అంచనా. కేరళలో ఏడుపదులు దాటిన వృద్ధులంతా కథలు కథలుగా చెప్పేది.. 1974 విలయం గురించే! ఆ ఏడాది జూలై 26ను ఒక భయానక రాత్రిగా వారు అభివర్ణిస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండడంతో కొండచరియలు విరిగిపడి 33 మంది ప్రాణాలు కోల్పోయారు.