ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఊపిరితిత్తులు బయటికి తీసి పూజలు
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డాగా మారిపోతుంది. యూపీలోనే కాకుండా దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. తాజాగా ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం చోటుచేసుకుంది. మూఢనమ్మకాలే ఆ బాలికను బలితీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాక, బాలికను హత్య చేసి.. అత్యంత కిరాతకంగా మృతదేహం నుండి ఊపిరితిత్తులను వేరుచేశారు. వీటితో పూజలు నిర్వహిస్తే మరో మహిళకు సంతానం కలుగుతుందని నిందితులు పేర్కొన్నారు. ఈ ఘటన దీపావళి రోజున కాన్పూర్ జిల్లాలో జరిగింది. నిందితులు అంకుల్ కురిల్, బీరన్, పరశురామ్‌లను అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి బ్రజేష్ శ్రీవాస్తవ తెలిపారు.
పరశురామ్ ఈ ఘటనకు కీలక సూత్రధారి అని, అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. తొలుత పరశురామ్ కేసును పక్కదారికి పట్టించేందుకు యత్నించారని, విచారణ అనంతరం నేరాన్ని అంగీకరించాడని చెప్పారు.
కాగా, 1999లో తమ వివాహం జరిగిందని, అయితే ఇప్పటివరకు తమకు సంతానం కలగలేదని అన్నారు. బాలికను అపహరించి, ఊపిరితిత్తులతో పూజలు జరిపితే సంతానం కలిగుతుందని తన మేనల్లుడు అంకుల్, అతని స్నేహితులను ఒప్పించానని విచారణలో అంగీకరించాడు.
ఘటంపూర్ ప్రాంతంలో దీపావళి రోజున టపాసులు కొనుక్కుని ఇంటికి వెళుతున్న బాలికను అపహరించారు. సమీపంలోని అడవికి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం హత్యచేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక ఆచూకీ కొసం తల్లిదండ్రులు సమీప ప్రాంతంలో గాలించారు.
టార్చిలైట్లతో సమీప అడవిలో బాలిక కోసం వెతికారు. మరుసటి రోజు సమీపగ్రామానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలికకు సంబంధించిన దుస్తులు, చెప్పులు దొరికాయని అన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామంటూ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ప్రకటించారు. నిందితులపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.