ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (15:44 IST)

భర్త నుంచి విడాకులు తీసుకున్న కుమార్తెను మేళతాళాలతో ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు... ఎక్కడ?

urvi divorce woman
సాధారణంగా అత్తారింటికి పంపించిన కుమార్తె కష్టాల్లో ఉన్నపుడు తల్లిదండ్రులు ఏదో విధంగా సర్దుకునిపోవాలని చెబుతుంటారు. ఎన్ని కష్టాలైనా పడొచ్చుగానీ, భర్తను వీడి రావొద్దని చెబుతుంటారు. అయితే, ఈ తల్లిదండ్రులు మాత్రం భర్త వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్న కుమార్తెను అత్తారింటి నుంచి పుట్టింటికి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ అపురూప దృశ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కుమార్తె ఉర్విని తండ్రి అనిల్ కుమార్ 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ఆశిష్ రంజన్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని రోజులు ఉర్విని అత్తింటివాళ్లు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇక ఉర్వికి కూతురు పుట్టినప్పటి నుంచి ఈ వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయి.
 
గత ఎనిమిదేళ్లుగా వాళ్లలో ఎలాంటి మార్పు రాకపోగా వేధింపులు అంతకంతకు పెరిగిపోయాయి. దాంతో ఆమె వారి వేధింపులు తాళలేక విదాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గత ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. ఆమె అభ్యర్థన మేరకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దాంతో ఉర్వి తండ్రి ఆమెను అత్తవారి ఇంటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు.
 
'మేము మా కూతురిని పెళ్లిచేసి అత్తారింటికి ఎలా పంపించామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. విడాకులతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వాళ్లు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఈవిధంగా చేశాం' అని అనిల్ కుమార్ చెప్పారు. కాగా, తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి పేర్కొన్నారు.
 
అలాగే ఉర్వి తల్లి కుసుమలత కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. తన కూతురు, మనవరాలితో కలిసి ఉండేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇది గొప్ప అనుభూతిగా ఆమె పేర్కొన్నారు. ఇక ఉర్విని ఆమె తండ్రి మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కష్ట సమయంలో కుమార్తెకు తోడుగా నిలిచిన ఆ తండ్రిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. గతంలోనూ ఝార్ఖండ్కు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన కూతురిని ఇలాగే మేళతాళాలతో పుట్టింటికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.