శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (10:01 IST)

హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను స్వదేశానికి తీసుకొస్తాం : మంత్రి పరమేశ్వర

Prajwal Revanna
కర్ణాటక రాజకీయాల్లో లైంగిన దౌర్జన్యం కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ స్కామ్‍లో ప్రధాన నిందితుడిగా ఉన్న హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు పారిపోయారు. ఆయనను భారత్‌కు తీసుకొస్తామని రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర సోమవారం తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
 
'కర్ణాటక మహిళా కమిషన్‌ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్‌ బి.కె.సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు. వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపుతారు. మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. అధికారిక సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు వెళ్లారు. సిట్‌ ఆయన్ను ఇక్కడకు తీసుకొస్తుంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక నిర్దిష్ట గడువును సూచించాం. లేదంటే ఏళ్లపాటు జాప్యం జరిగే ప్రమాదం ఉంది. 10-15 రోజుల్లో దీనిపై నివేదిక అందుతుందని అనుకుంటున్నాం. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి' అని పరమేశ్వర మీడియాతో అన్నారు.
 
గతంలో కూడా ఇదేతరహా ఆరోపణలతో హెచ్‌.డి.రేవణ్ణపై కూడా ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఆయనపై కూడా విచారణ జరుపుతారని పరమేశ్వర తెలిపారు. సిట్‌ నివేదిక ఆధారంగానే ఆయనపైనా చర్యలుంటాయని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైతే బాధితులు, ఫిర్యాదుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని వెల్లడించారు.
 
ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన సిటింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక దౌర్జన్యం కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరి వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని జేడీఎస్‌ నేతలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సోమవారం ప్రకటించారు. ఇదే అంశంపై మంగళవారం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.