గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:12 IST)

హాసన సె... స్కామ్ కేసు... వెలుగు చూస్తున్న కొత్త కోణాలు!!

victim woman
బెంగుళూరులో ఇటీవల వెలుగు చూసిన హాసన సెక్స్ కుంభకోణం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు, ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె. రేవణ్ణకు సోదరి వరస. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్‌లో వంట పని చేసేందుకు అవకాశాన్ని కల్పించారు. తన నివాసంలో 2015లో పనిలో చేర్పించుకున్నారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారు. పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. 
 
భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలి ఆరోపణ. పండ్లు ఇచ్చే నెపంతో స్టోరూమ్‌కు పిలిచి వేధించేవారని వివరించింది. తాను వంట గదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్‌ రేవణ్ణ శరీరాన్ని తాకుతూ వేధించేవారని ఆరోపించింది. నలుగు స్నానం చేయించాలని, ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించాలని స్నానాలగదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించింది. ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్‌ చేసి ప్రజ్వల్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతని చేష్టలకు భయపడి కుమార్తె ప్రజ్వల్‌ ఫోన్‌ నంబరును బ్లాక్‌ చేసుకుందని, ఆ తర్వాత తానూ పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని తెలిపింది. కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉండడంతో తన భర్త నుంచి ఎదురైన ఇక్కట్ల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులతో జరిగిన ఘటనలతో ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించింది.
 
మరో వైపు యువతులను ప్రలోభ పెట్టి, ప్రజ్వల్‌ తన వాంఛలను తీర్చుకుని, వాటిని వీడియోలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు దుయ్యబట్టారు. ఆయనను పొత్తు అభ్యర్థిగా బరిలో నిలిపి భారతీయ జనతా పార్టీ తప్పు చేసిందని ఆ పార్టీ సానుభూతిపరులు విమర్శలు గుప్పించారు. ప్రజ్వల్‌ వీడియోలు అంటూ మూడు వేలకు పైగా వీడియో సీడీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలు, వీడియోకు సంబంధించిన ఆరోపణలపై మాట్లాడేందుకు విపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ నిరాకరించారు. దళ్‌ నేతలే దానికి సంబంధించి మాట్లాడతారని, దర్యాప్తు అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.
 
హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని రెవెన్యూ మంత్రి కృష్ణ భైరేగౌడ పేర్కొన్నారు. కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రి, రేవణ్ణ ఐదుసార్లకు పైగా మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. హాసన లోక్‌సభ సభ్యునిగా ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ఆయన సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రేవణ్ణ నివాసంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. దర్యాప్తులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.