ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (10:50 IST)

పెళ్లి పెద్దగా భర్త... భార్యకు ప్రియుడితో వివాహం... ఎక్కడ?

కొన్ని సంఘటనలు, దృశ్యాలు వినేందుకు చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగాను ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ, అలాంటివి నమ్మి తీరాల్సిందే. భర్త పెళ్లి పెద్దగా మారి తన భార్యను ఆమె ప్రియుడికిచ్చి వివాహం జరిపించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరు జిల్లాలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాన్పుర్‌కు చెందిన కోమల్‌ - పంకజ్‌లకు ఆరు నెలల క్రితం వివాహమైంది. పేరుకే పెళ్లి తప్ప.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి అనురాగం లేదు. దీంతో అసలు సమస్యేంటని భార్యను భర్త ఆరా తీశాడు. ‘నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను’ అని హామీ ఇచ్చాడు.
 
దీంతో కోమల్‌ అసలు విషయం చెప్పేసింది. పింటు అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. తన కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని వివరించింది. పింటుతో ఉంటేనే సుఖంగా ఉంటానని చెప్పింది. 
 
ఇదంతా ఆలకించిన పంకజ్‌.. రవ్వంత కూడా కోపవడలేదు. ప్రశాంతంగా సరేనన్నాడు. ముందుగా తన కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడాడు. పద్ధతి ప్రకారం భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పింటు, కోమల్‌కు వివాహం జరిపించాడు. ఈ వివాహాన్ని అతనే దగ్గరుండి జరిపించాడు. అలా కట్టుకున్న భార్య పెళ్లికి భర్త పెళ్లి పెద్దగా మారి వివాహం జరిపించడంతో ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశమైంది.