శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (15:38 IST)

పెళ్లి పీటలపై నుంచి వధువును ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఎక్కడ.. ఎందుకు?

bride
సాధారణంగా పెళ్లి సీన్లలో సరిగ్గా మూడుముళ్లు వేసే సమయానికి "ఆపండి" అనే డైలాగ్‌ వింటుంటాం. ఇపుడు అచ్చం ఇలాంటి డైలాగే కేరళ రాష్ట్రంలోని ఓ కళ్యాణ మండపంలో వినిపించింది. వధువు మెడలో వరుడు తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు... వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇంతకీ ఆ పెళ్లిని పోలీసులు ఎందుకు ఆపారు? అసలేం జరిగిందో తెలుసుకుందాం... 
 
రాష్ట్రంలోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్‌ ప్రేమించుకున్నారు. మతాలు వేరవడంతో కుటుంబసభ్యులు వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆదివారం స్థానిక ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు ఆలయానికి వెళ్లారు. అల్ఫియాను బలవంతంగా అక్కడి నుంచి కోవలం పోలీస్‌స్టేషన్‌ను తీసుకొచ్చారు. 
 
తాను రానని అల్ఫియా అరుస్తుండగా ఆమెను బలవంతంగా ఓ ప్రైవేటు వాహనంలోకి ఎక్కించారు. వరుడు అఖిల్‌ ఆమె దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కేరళ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
దీనిపై అలప్పుళ జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అల్ఫియా కన్పించకుండా పోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని, దానిపై తాము దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి అక్కడకు వెళ్లామని, కోర్టు ఆదేశాల మేరకు ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. ఆమె అఖిల్‌తోనే వెళ్తానని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించిందని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.