శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (10:31 IST)

కోవిడ్ సెకండ్ వేవ్: కేరళలోని 4 జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్‌

కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు జరుగుతున్నా వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. 24 గంటల్లో 34 వేల 694 కొత్త కేసులు, 93 మరణాలు వెలుగుచూశాయి.
 
దీంతో రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న పూర్తి లాక్‌డౌన్‌ను ఈ నెల 23వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. అలాగే, కేరళలోని 4 జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు చెప్పారు.
 
పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూర్‌, మలప్పురం జిల్లాల్లో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు వెల్లడించారు. ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ అనేది మూడు అంచెల కోవిడ్‌ 19 కట్టడి వ్యూహం. దీన్ని మూడు దశలుగా చేపడతారు. కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న వారం రోజుల లాక్‌డౌన్‌ మే 16నాటికి పూర్తి కానుంది.
 
లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు అందిస్తున్న ఉచిత ఆహారం కిట్‌లను మే, జూన్‌ మాసాల్లోనూ పంపిణీ చేస్తామని విజయన్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి మే 17 నుంచి టీకా పంపిణీ ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ కేటగిరీకి చెందిన వారు ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు.