గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (14:58 IST)

తెలంగాణాకు తుఫాను తాకిడి... అరేబియా సముద్రంలో 'తౌక్టే'

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
 
ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని 'తౌక్టే' అని పిలుస్తారు. 'తౌక్టే' తీవ్ర తుపానుగా, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది, గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
 
దీని ప్రభావంతో లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకణ్-గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్‌లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదికలో పేర్కొన్నారు. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదని హెచ్చరించారు. తౌక్టే ప్రభావం ఏపీపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.
 
మరోవైపు, జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్ అంచనాలకు తగ్గట్టుగానే వర్షపాతాన్ని ఇస్తుందని పలు వాతావరణ సంస్థలు ముందస్తు నివేదికల్లో వెల్లడించాయి.
 
ఇదిలావుంటే, తెలంగాణలో ఈ నెల 16, 17 తేదీల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్ప పీడనం ఏర్పడిందని, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియర్‌ ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు చెప్పింది. అల్పపీడనం మరింత బలపడి 16వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. 
 
ఇప్పటికే ఏర్పడిన ఉత్తర - దక్షిణ ద్రోణి/గాలి విచ్ఛిన్నతి గురువారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదగా దక్షిణ తమినాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. 
 
రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.