శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (11:43 IST)

'నివర్' ముప్పు తొలగింది.. 'బురేవి' భయం వణికిస్తోంది!

ఇటీవల వచ్చిన నివర్ తుఫాను సృష్టించిన బీభత్సం అంతాఇంతాకాదు. దీనినుంచి కోలుకోకముందే మరో తుఫాను తరుముకొస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం మొదలు కాగా, దీనికి 'బురేవి' అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
ఈ తుఫాను ప్రభావంతో ఆదివారం నుంచే తీర ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జలాశయాలు పూర్తిగా నిండి, చెరువులు, కుంటలతో పాటు పంట పొలాల్లోకి సైతం నీరు చేరిపోవడంతో మరోసారి వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమవుతోందన్న భయం రైతుల్లో నెలకొని వుంది.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది వాయుగుండంగా, తుఫానుగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఆపై పశ్చిమ దిశగా ప్రయాణిస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది దక్షిణ తమిళనాడు వైపు వస్తుందా? లేదా మరో దిశగా సాగుతుందా? అనే విషయం ఆదివారం సాయంత్రానికి తెలుస్తుందని అధికారులు తెలిపారు.
 
అంతేకాకుండా, రానున్న వారం రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.