గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (10:37 IST)

కశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‍‌పై మళ్లీ దాడి.. అధికారితోపాటు ముగ్గురు జవాన్ల వీరమరణం

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఘాతుక చర్యకు బరితెగించారు. కుప్వారా సమీపంలోని అతి పెద్ద సైనిక క్యాంపుపై ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి చేసిన దాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా మ

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఘాతుక చర్యకు బరితెగించారు. కుప్వారా సమీపంలోని అతి పెద్ద సైనిక క్యాంపుపై ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి చేసిన దాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. గురువారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది.ఇరు వర్గాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. సమీప ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కోనసాగుతోంది. 
 
ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను కూడా సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. వారిని నిలువరించకుంటే ఆర్మీకి చెందిన సామాగ్రిని దోచుకోవడమో దానిపై ఆత్మాహుతిదాడికి పాల్పడటమో జరిగి ఉండేదని భావిస్తున్నారు. 
 
ఈరోజు జరిగిన దాడి గత సంవత్సరం యూరిలో జరిగిన దాడిని తలపించింది. ఆనాటి ఘటనలో 19 మంది సైనికులు ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగారు. గురువారం తెల్లవారు జామున జరిగిన దాడిలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. కేంద్ర హోమంత్రి రాజనాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్తితిని అంచనా వేయడానికి భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పర్చనున్నారు. 
 
ఇదిలా ఉండగా నలుగురు జవాన్లను అగమేఘాల మీద శ్రీనగర్‌కు వైద్యచికిత్సకోసం తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఊహిస్తున్నదానికంటే ఎక్కువగానే సైన్యం దెబ్బతిందని తెలుస్తోంది. సైనిక బలగాల నుంచి సమగ్ర వివరణ ఇంకా రావలసే ఉంది. ఇద్దరు ఉగ్రవాదులు చావగా మిగిలిన వారికోసం సైన్యం గాలింపులను తీవ్రం చేసింది.