శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (10:27 IST)

'మధ్యప్రదేశ్‌' సంక్షోభం.. సింధియా తిరుగుబాటు.. కమలనాథ్‌కు గండం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో ఆయన అదృశ్యమయ్యారు. ఈయన మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌లు రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా, అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీరికరించారని నిర్ణయించారు. ఫలితంగా 20 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 
 
ఫలితంగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దినదినగండంగా కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కమల్‌నాథ్‌కు పదవీ గండం పొంచి ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. మరోవైపు, ఇటీవల సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కనిపించకుండా పోయిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు తిరిగిరాగా.. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నది. 
 
మరోవైపు, అధికార పార్టీలో మొదలైన సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను వివరించారు. 
 
బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్‌ను కలుస్తారని సమాచారం. మొత్తంమీద మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించి, దాన్ని తమవశం చేసుకునేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నారంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.