శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (14:43 IST)

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : హార్స్ ట్రేడింగ్‌కు తెరలేపిన బీజేపీ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బొటాబొటి మెజార్టీతో ఉన్న ముఖ్యమంత్రి కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి.. వారిని గుర్గావ్, అక్కడ నుంచి బెంగుళూరుకు తరలించినట్టు వార్తలు వస్తాయి. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనేలా ఉంది. 
 
ఈ ఎపిసోడ్‌కు ప్రధాన కారకులుగా భావిస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, నలుగురు అసంతృప్త ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం తెల్లవారుజామున బెంగళూరుకు తరలించింది. అదేసమయంలో సీఎం కమల్‌నాథ్ ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
ఇప్పటికే తమ ప్రభుత్వంలోని 8 మంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బలవంతంగా హర్యానాలోని ఓ హోటల్లో ఉంచరాని కాంగ్రెస్‌ సీనియర్‌‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు ఇద్దరు కాంగ్రెస్‌ మంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బీఎస్‌పీ సభ్యురాలు రాంబాయ్‌ సహా ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కిరావడంతో కాంగ్రెస్‌ కొంత విజయం సాధించినట్టయింది.
 
అంతకుముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలను కొనేసి.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రభుత్వం బలంగా ఉందని, ఐదేళ్ల పాటు పూర్తి స్థాయిలో కొనసాగుతుందన్నారు. 
 
కాగా, దిగ్విజయ్ ఆరోపణలను నరోత్తం మిశ్రా ఖండించారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తితోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా వెళ్లిపోయారని చెప్పారు.