శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:24 IST)

కర్నాటకలోనూ రాజధాని వికేంద్రీకరణ.. సీఎం జగన్ ఆశలకు జీవం

కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో కేంద్రీకృతమైవున్న కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 
 
బీజేపీ అధిష్టానం పచ్చ జెండా ఊపడంతో ఈ ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం వచ్చింది. 
 
అమరావతి నుంచి కొన్ని కార్యాలయాలను విశాఖపట్నం, కర్నూలుకు తరలిస్తామని ప్రకటించిన తొలి రోజుల్లో కొందరు బీజేపీ నేతలు, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని వైకాపా నాయకులు సంతోషిస్తున్నారు. 
 
కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని కార్యాలయాలను వారికి దగ్గరగా తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
 
అయితే, ఏపీలోని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్నాటక ప్రభుత్వం చర్య సరికొత్త ఉత్సాహాన్నిచ్చేలా వుంది. అరావతిలో లెజిస్లేటివ్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూలులో జ్యుడీషియల్ రాజధానుల ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. 
 
అయితే ఈ ప్రతిపాదనలను విపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో బీజేపీ నిర్ణయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలకు జీవం పోసినట్టవుతుందని భావిస్తున్నారు.