సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:03 IST)

కర్నాటకలో లోకల్ ఫైట్... తిరుపతి బస్సులపై రాళ్ళదాడి... తెలుగు యువతకు ఎర్త్?

కర్నాటక రాష్ట్రంలో లోకల్ ఫైట్ సాగుతోంది. స్థానిక ఉద్యోగాల్లో స్థానిక యువతకు కోటా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో కర్నాటక రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా, స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్రానికి చెందిన అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
స్థానిక క‌న్న‌డీయుల‌కు ఉద్యోగాల్లో కోటా క‌ల్పించాల‌ని ప‌లు సంఘాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు, ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఆ కోటా ఉండాల‌ని క‌న్న‌డ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం బంద్ నేప‌థ్యంలో ఫరంగిపేట వ‌ద్ద ఓ బ‌స్సుపై రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సు ఆ దాడిలో ధ్వంస‌మైంది. ఈ ఘటన ఫరంగిపేట వద్ద జరిగింది. 
 
క‌న్న‌డ ఐక్య కూట‌మి ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగుతున్న‌ది. బెంగుళూర్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు బంద్ పాటిస్తున్నారు. ఓలా, ఊబ‌ర్ డ్రైవ‌ర్లు కూడా బంద్‌కు స‌హ‌క‌రిస్తున్నారు. బంద్ నేప‌థ్యంలో బెంగుళూరు వ‌ర్సిటీ పీజీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను మార్చింది. నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని క‌ర్నాట‌క సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు.  
 
కర్నాటకలోని బళ్ళారి, బెల్గాం వంటి ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీల్లో సింహ భాగం ఉద్యోగులు తెలుగువారే. ముఖ్యంగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన యువతే అత్యధికంగా పని చేస్తోంది. అయితే, స్థానిక ఉద్యోగాల్లో తమకు కోటా అమలు చేయాలని డిమాండ్లు పుట్టుకొచ్చాయి. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన యువతకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.